ఎడిటోరియ‌ల్ | ✍🏻 స్వామి ముద్దం, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు
(ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రి దినోత్సవం సంద‌ర్భంగా వ్యాసం)

తీవ్ర ఎండలు, పొడి వాతావరణంతో ఉండే ఎడారి దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను ఆక‌స్మికంగా భారీ వరదలు ముంచెత్త‌డం తీవ్ర చ‌ర్చ‌నీయంశంగా మారింది. కుండ‌పోత వ‌ర్షాల‌కు యూఏఈలోని పలు న‌గ‌రాలు, ప్రాంతాలు నీట మునిగాయి. ఏడాదిన్న‌ర‌లో కుర‌వాల్సిన వాన కొన్ని గంట‌ల్లోనే కుర‌వ‌డం ఏంటీ? ఇది మానవ కల్పితమా లేక ప్రకృతి ప్రకోపమా? ఎక్కడ చూస్తే అక్కడ ఇసుక తిప్పలు పరచుకుని ఉండే దుబాయిలో కుండపోతగా వర్షం కురవడం ఏమిటి? దుబాయ్ వంటి ప్ర‌పంచ న‌గ‌రం అతలాకుతలం కావడం ఏమిటి? అతిపెద్ద విమానాశ్ర‌యంలో విమానాల రాకపోకలు రద్దు చేశారంటే పరిస్థితి తీవ్రత ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఆ దృశ్యాలను చూసిన ప్రపంచం విస్తుపోతున్న‌ది.

తీవ్ర గాలులు, భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. 24 గంటల వ్యవధిలోనే 142 మి.మీ. రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఈతరహా వర్షాలు ఎన్నడూ కురవలేదని అధికారుల అంచనా. ఎడారి నగరమైన దుబాయిలో కేవలం 24 గంటల్లో 25 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇది ఏడాది మొత్తంలో నమోదయ్యే వర్షపాతం కంటే ఎక్కువ. 75 ఏండ్ల తర్వాత దుబాయి ఈ స్థాయి వర్షాన్ని చూసిందంటున్నారు. ఇంతకూ ఈ ఉత్పాతం ఎందుకు వచ్చిపడిందనే తర్జనభర్జనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతంలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’  కారణమనే అభిప్రాయాలున్నాయి. భూమిపై అత్యంత వేడి, పొడి ప్రాంతంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంటుంది. వేసవిలో ఇక్కడ గరిష్ఠంగా 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వార్షిక వర్షపాతం సగటున 200 మి.మీ.లోపు నమోదవుతుంది. దీంతో భూగర్భజల వనరులపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకుగాను కృత్రిమ వర్షాలను కురిపించే క్లౌడ్ సీడింగ్ పద్ధతిని ఇక్కడ ఎప్పటినుంచో అమలుచేస్తున్నారు. పెరుగుతోన్న జనాభాకు సరిపడా తాగునీరు అందించడమే వీటి ప్రధాన ఉద్దేశం. ఈ పద్ధతే కొన్నిసార్లు ఆకస్మిక వరదలకు కారణమవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

కృత్రిమ వర్షాలను కురిపించే పద్ధతిని యూఏఈ 1982 తొలినాళ్లలోనే పరీక్షించింది. అనంతరం అమెరికా, దక్షిణాఫ్రికా, నాసాకు చెందిన పరిశోధన బృందాల సాంకేతిక సహాయంతో 2000 తొలినాళ్లలోనే క్లౌడ్ సీడింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎమిరేట్స్ నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM)తో కలిసి యూఏఈ రెయిన్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రాం (UAEREP) దీన్ని చేపడుతోంది. వాతావరణ మార్పులను ఇక్కడి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పు డు పర్యవేక్షిస్తుంటారు. యూఏఈతో పాటు ఈ ప్రాంతంలోని సౌదీ అరేబియా, ఒమన్లు కూడా కృత్రిమ వర్షాల కోసం ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. భారత్‌లోనూ ఈతరహా ప్రయత్నాలు జరిగిన విషయం తెలిసిందే.

సాధారణంగా ‘క్లౌడ్ సీడింగ్’ పద్ధతిలో సిల్వర్ అయోడైడ్ రసాయనాన్ని ఉపయోగిస్తారు. ఈతరహా హానికర రసాయనాలకు దూరంగా ఉన్న యూఏఈ.. సాధారణ లవణాలనే వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం టైటానియం ఆక్సైడ్ పూత కలిగిన ఉప్పుతో ‘నానో మెటీరియల్’ను ఎన్సీఎం అభివృద్ధి చేసిందట. ఇలా నీటి సం క్షోభాన్ని ఎదుర్కొనేందుకు యూఏఈ వినూత్న విధానాన్ని అనుసరిస్తోంది. స్థానిక అవసరాల కోసం చేపట్టే కృత్రిమ వర్షాలతో తాత్కాలికంగా ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఈ పద్ధతి వల్ల ప్రతికూల ఫలితాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒక ప్రాంతంలో వర్షాలను కురిపించాలంటే మరోచోట కరవుకు కారణమవుతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అంటున్నారు. ముఖ్యంగా సహజ వనరుల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.

భూగోళం వేడెక్కుతుండటంతో, ఈ దశాబ్దం చివరి నాటికి దాదాపు యూఏఈ అంతటా వార్షిక వర్షపాతం దాదాపు 30 శాతం పెరగొచ్చని ఇటీవల ఒక అధ్యయనం సూచించింది. ‘‘మానవులు చమురు, గ్యాస్, బొగ్గును కాల్చడం కొనసాగిస్తే వాతావరణం వేడెక్కుతూనే ఉంటుంది. వర్షాలు మరింత తీవ్రరూపం దాల్చుతాయి. వరదలతో ప్రాణనష్టం జరుగుతూనే ఉంటుంది’’ అని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన క్లైమేట్ సైన్స్ సీనియర్ లెక్చరర్, డాక్టర్ ఫ్రెడెరికె ఓట్టో చెప్పారు.

దుబాయి భారీ వానల్ని ప్రమాద ఘంటికలుగా భావించి భూతాపం తగ్గింపునకు ప్రపంచ దేశాలు త‌క్ష‌ణ‌ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఆస‌న్న‌మైంది. పర్యావరణ పరిరక్షణకు, భూగోళ సంరక్షణకు పాటుపడాల్సిన క‌ర్త‌వ్యాన్ని ప్ర‌తి ఒక్క‌రు గుర్తించాలి.

 

 

‘Swadesam’: Your Trusted Partner for NRI Services !

 

HYSTAR: Uniting Indian Cine People in One App – Revolutionizing the Film Industry

 

Hystar
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

 

By admin

Leave a Reply

Your email address will not be published.