తెలుగు సినీ, టీవీ రంగాల్లో పనిచేసే మహిళా కార్మికుల హక్కుల కోసం ఏర్పాటైన ప్రొడక్షన్ యూనియన్‌లో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. యూనియన్ అధ్యక్షురాలు లలిత వ్యవహారశైలిపై పలువురు సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అత్యవసర మీడియా సమావేశంలో బాధిత సభ్యులు రేణుక, శైలజ, భారతమ్మ, ఆదిలక్ష్మి, అరుణ తమ ఆవేదనను వెల్లడించారు.

ప్రతి ఏటా తాము రూ.5,000 చొప్పున కష్టపడి చెల్లిస్తున్న చందాలు, యూనియన్ ఆస్తులు, గత పదేళ్ల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పారదర్శకమైన లెక్కలు అడిగితే అధ్యక్షురాలు నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ ఎగతాళి చేస్తున్నారని వారు ఆరోపించారు. ప్రశ్నించిన వారిని కమిటీ ఆమోదం లేకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేయడమే కాకుండా, ప్రొడక్షన్ మేనేజర్లు మరియు చీఫ్‌లకు ఫోన్లు చేసి పనులు ఇవ్వవద్దంటూ ఒత్తిడి తెస్తున్నారని వాపోయారు.

రోజువారీ ఉపాధిపై ఆధారపడి జీవించే తమను అసభ్య పదజాలంతో దూషిస్తూ, కేసుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏకపక్ష చర్యలను నిరసిస్తూ, యూనియన్ నిధులపై స్పష్టమైన లెక్కలు తేల్చాలని, తమకు ఉపాధి భద్రత కల్పించి సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించేలా తెలుగు ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ పెద్దలు వెంటనే జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *