ఇంతకాలం కలల్ని అమ్మారు… ఇప్పుడు స్థానం లేదంటారా?
అమెరికా ఉపాధ్యక్షుడు, ఆంధ్రా అల్లుడు జేడీ వాన్స్‌కు ఊహించని ఇబ్బంది ఎదురైంది. వలసదారులపై ట్రంప్ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ, భారతీయ మూలాలున్న ఓ యువతి వాన్స్ ముఖం మీదే గట్టి ప్రశ్నలు సంధించింది. ఆమె అడిగిన ప్రశ్నలతో వాన్స్ కాసేపు మాటలు రావట్లేదనేలా అయ్యారు.
మిసిసిప్పీ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన టర్నింగ్ పాయింట్ యూఎస్‌ఏ (Turning Point USA) ఈవెంట్‌లో జేడీ వాన్స్ ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. తన ప్రసంగంలో, అమెరికాలో వీసా విధానాన్ని మరింత కఠినతరం చేయాలని, చట్టబద్ధ వలసదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ఆ సమయంలో భారతీయ సంతతికి చెందిన ఓ యువతి మైక్ తీసుకుని వాన్స్‌ను నిలదీశారు—
“ఇంతకాలం అమెరికా కలల్ని మాకు అమ్మారు. ఆ కలల కోసం మేము మా యవ్వనాన్ని, సంపదను వెచ్చించాం. ఇప్పుడు మరిన్ని వలసదారులు వస్తున్నారు అంటారా? వాళ్లను వెనక్కి పంపాలంటారా? మేము చట్టబద్ధంగా వచ్చాం, మీ నిబంధనలు పాటించాం. ఇక మాకు ఈ దేశంలో స్థానం లేదని చెబుతున్నారా?”
ఆమె ప్రశ్నలకు సభలోని కొందరు ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ మద్దతు తెలిపారు. అయితే, ఆమె స్పష్టంగా చెప్పింది— “నేను వాదన చేయడానికి కాదు, వాస్తవాన్ని గుర్తు చేయడానికే అడుగుతున్నాను” అని.
వాన్స్ ఈ ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వకుండా, అధిక వలస అమెరికా సామాజిక నిర్మాణాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. “కొంతమంది అక్రమ వలసదారులు దేశానికి మేలు చేశారు, కానీ అందుకే లక్షల మందిని అనుమతించాలనేది సరైన ఆలోచన కాదు” అని సమర్థించుకున్నారు.
https://x.com/TrulyMonica/status/1983928896132382953
అప్పుడు ఆ యువతి మరో ప్రశ్న వేశారు—
“అమెరికాను ప్రేమించాలంటే క్రిస్టియన్ కావాలా?”
దానికి వాన్స్ సమాధానంగా, “నేను మత బోధనను విశ్వసిస్తాను. నా భార్య కూడా భవిష్యత్తులో అదే విశ్వాసాన్ని కలిగి ఉంటుందని ఆశిస్తున్నాను. కానీ, ఆమెకు స్వేచ్ఛ ఉంది” అని తెలిపారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. ఇండో-అమెరికన్లు ఆయన ద్వంద్వ వైఖరిపై తీవ్రంగా మండిపడుతున్నారు. “హిందూ భార్యను కలిగి ఉండి, ఆమె మతాన్ని మార్చుకోవాలని ఆశించడం విరుద్ధత కాదా?” అని ప్రశ్నిస్తున్నారు. కొందరు వాన్స్ వివాహం వేద హిందూ సంప్రదాయంలో జరిగినదని గుర్తు చేశారు.
వాన్స్‌ను ప్రశ్నించిన ఆ యువతి ఎవరో అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
https://x.com/TrulyMonica/status/1983928896132382953/photo/1

