రంగురంగుల పువ్వుల కోక కట్టుకొని అభయమివ్వడానికి వచ్చిన ప్రకృతి మాత బతుకమ్మ. బతకడానికి కావలసినంత భరోసాని ఎదనిండా నింపే అమ్మ బతుకమ్మ. ఆ అమ్మను కనులారా చూసుకొని, కమనీయంగా పాడుకొని, సిరిసంపదలు, సౌభాగ్యాలు ప్రసాదించమని కోరుకునే అతివలకు కొంగుబంగారం బతుకమ్మ. వాషింగ్టన్ డీసీ తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (TDF-DC) ఆధ్వర్యంలో 20వ బతుకమ్మ & దసరా సంబురాలు ఘ‌నంగా జ‌రిగాయి.

అల్డీ, వర్జీనియా: వాషింగ్టన్ డిసి తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (TDF-DC) ఆధ్వర్యంలో 20వ బతుకమ్మ–దసరా సంబరాలు అల్డీ లోని జాన్ చాంపే హై స్కూల్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. 2 దశాబ్దాలుగా అమెరికా నేలపై తెలంగాణ సాంస్కృతిక విలువలను ప్రతిబింబిస్తున్న ఈ ఉత్సవాలకు వేలాది మంది తెలుగు ఎన్నారైలు హాజరై ఉత్సాహభరితం చేశారు.

ఈ వేడుకలకు ప్రముఖ గాయని, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత కె.ఎస్. చిత్ర‌ ముఖ్య అతిథిగా హాజరై తన సమక్షంతో సందడి చేశారు. ఆమె హాజరు వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ జానపద గాయకుడు బిక్షు నాయిక్ తన గానం ద్వారా ప్రేక్షకులను అలరించి, తెలంగాణ జానపద స్ఫూర్తిని ప్రతిబింబించారు. అతిథులుగా ప‌లు ఎన్నారై అసోషియేష‌న్ నాయ‌కులు పాల్గొన్నారు. ఆటా ప్రెసిడెంట్ జ‌యంత్ చ‌ల్లా పాల్గొని రెండు ద‌శాబ్దాల పాటు బ‌తుక‌మ్మ నిర్వ‌హిస్తున్న వాషింగ్టన్ డిసి తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం నిర్వ‌హ‌కుల‌కు శుభాకాంక్ష‌లు, అభినంద‌న‌లు తెలిపారు.

బతుకమ్మ ప్రదర్శన, జానపద నృత్యాలు, సాంప్రదాయ గీతాలు, దసరా ఉత్సవాలతో వేదిక సందడిగా మారింది. అశ్విని చిట్టిమల్ల గ్రూప్ అందంగా అలంకరించిన బతుకమ్మ ప్రాంగణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మంజువాణి మద్దికుంట, శ్రీలక్ష్మి పోలోజు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో మహిళలు, పిల్లలు, యువత చురుకుగా పాల్గొని అద్భుతమైన నృత్యాలతో మంత్రముగ్ధుల్ని చేశారు. రంగురంగుల బతుకమ్మలతో మహిళలు, చిన్నారులు చేసిన ప్రదర్శనలు వేడుక వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చాయి.

బాలల బతుకమ్మతో సహా వివిధ విభాగాలలో బతుకమ్మలను అందంగా పేర్చిన మహిళలకు  TDF నిర్వహకులు బహుమతులు అందించారు.

అవంతిక నక్షత్రం రూపొందించిన బతుకమ్మ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఈ వేడుక‌ను మంజుషా నాంపల్లి, రుద్ర భీమ్‌రెడ్డి కన్వీనర్లుగా సమన్వయం చేశారు. పూర్వ అధ్యక్షులు కవిత చల్లా, సలహాదారులుగా వినయ సూరినేని, కల్పనా బోయినపల్లి కీలక సహకారం అందించారు.

సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం స్థానిక రెస్టారెంట్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉచిత విందు ద్వారా వేలాది కుటుంబాలు స్నేహపూర్వక వాతావరణంలో కలసి భోజనం చేసి ఆనందం పంచుకున్నారు. అమెరికా నేలపై ఇంతటి భవ్యమైన తెలంగాణ ఉత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించడం గర్వకారణమని పలువురు పాల్గొన్నవారు పేర్కొన్నారు.

ఈ విజయవంతమైన కార్యక్రమం వెనుక నిలిచిన స్పాన్సర్లు, వాలంటీర్లు, కమ్యూనిటీ సభ్యులకు TDF-DC ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

సాంస్కృతిక ఉత్సవాలతో పాటు గ్రామీణ తెలంగాణలో రైతులు, మహిళలు, యువత ఆరోగ్య రంగ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను కొనసాగిస్తూ, సమాజాభివృద్ధి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తోంది TDF-USA.

  

 

 

https://www.globaltimes.tv/index.php/2023/05/18/swadesam-your-trusted-partner-for-nri-services/

 

https://www.globaltimes.tv/index.php/2023/05/18/swadesam-your-trusted-partner-for-nri-services/

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *