న్యూజెర్సీ: అమెరికా తెలుగు సంఘం (ATA) సాహిత్య విభాగం ఆధ్వర్యంలో ఆదివారం న్యూజెర్సీ లో దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవ సాహిత్య సభ ఘనంగా జరిగింది. సాహిత్యాభిమానులు, కవులు, రచయితలతో కార్యక్రమం కళకళలాడింది.
సదస్సును ‘ఆటా’ సాహిత్య విభాగం చైర్ వేణు నక్షత్రం, కో-చైర్ రాజ్ శీలం సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. ప్రధాన అతిథులుగా ప్రముఖ కవి, అవధాని నరాల రామారెడ్డి, సుభద్ర వేదుల, తమ్మినేని యదుకుల భూషణ్ పాల్గొన్నారు. వీరు దాశరథి గారి సాహిత్య ప్రస్థానం, ఉద్యమ కవిత్వం, తెలుగు భాషపై ఆయన చూపిన అపారమైన ప్రేమపై విశ్లేషణాత్మకంగా ప్రసంగించారు. ముఖ్యంగా నరాల రామారెడ్డి గారు, దాశరథితో తన అనుబంధాన్ని స్మరించగా సభలో ఉన్న సాహిత్యాభిమానులు ఆసక్తిగా ఆలకించారు.

ఈ సందర్భంగా ఆటా అధ్యక్షులు జయంత్ చల్లా మాట్లాడుతూ, ఆటా నిర్వహిస్తున్న సాంస్కృతిక, సామాజిక సేవలతో పాటు ఈ ఏడాది జరిగే కన్వెన్షన్‌లో సాహిత్య విభాగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. కవితా పోటీలను వినూత్నంగా నిర్వహించి ప్రతిభావంతులైన కవులను సత్కరించనున్నట్లు ఆయన ప్రకటించారు.
కార్యక్రమంలో ప్రముఖులు, స్థానిక సాహిత్యాభిమానులు కవితలు చదివి సభను మరింత ఉత్సాహవంతంగా మార్చారు. దాశరథి విప్లవాత్మక కవిత్వం, జైలు జీవితంలో సృష్టించిన అద్భుత రచనలపై చర్చలు జరిగాయి.

ఈ వేడుక విజయవంతం కావడానికి ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీలు శ్రీనివాస్ దార్గుల, సంతోష్ రెడ్డి కోరం, రీజనల్ డైరెక్టర్ విలాస్ రెడ్డి జంబుల, మెంబర్షిప్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ తుమ్మల, రీజనల్ కన్వీనర్ కృష్ణమోహన్, ఆకుల ప్రసాద్ తదితరులు కీలక పాత్ర పోషించారు.
సాహిత్య సభలో పాల్గొన్న వక్తలు, కవులు, రచయితలు – దాశరథి గారి రచనల వారసత్వాన్ని రాబోయే తరాలకు అందించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమం సాహిత్యాభిమానులకు స్మరణీయంగా నిలిచింది.

https://www.globaltimes.tv/index.php/2023/05/18/swadesam-your-trusted-partner-for-nri-services/
https://www.globaltimes.tv/index.php/2023/05/18/swadesam-your-trusted-partner-for-nri-services/


