ఆర్వీ సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కిన ‘అరి’ చిత్రాన్ని ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ‘పేపర్ బాయ్’ ఫేమ్ దర్శకుడు జయశంకర్ ఈసారి మానవుడి అంతర్ముఖ ప్రపంచాన్ని అరిషడ్వర్గాల (కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం) ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్ వంటి ప్రముఖులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకీ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.
కథ:
మానవ జీవితంలో ఉన్న ఆరు అంతర్గత శత్రువులు — అరిషడ్వర్గాలు — ఈ కథకు పునాది. ఈ భావాల ప్రతీకగా ఆరు పాత్రలు తమ కోరికలతో తెరపైకి వస్తాయి. సన్నీ లియోన్‌తో ఒక రాత్రి గడపాలన్న ఆశతో ఉన్న అమూల్ (వైవా హర్ష), మరణించిన భర్తను తిరిగి రప్పించాలని తహతహలాడే లక్ష్మీ (సురభి ప్రభావతి), వీరిద్దరితో పాటు ఇతర పాత్రల కోరికలు కూడా మనలోని ‘మరొక మనిషిని’ చూపిస్తాయి.
“ఇచ్చట అన్ని కోరికలు తీర్చబడును” అనే ఒక రహస్య ప్రకటన వీరిని కలిపేస్తుంది. ఆ ప్రకటన వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? కోరిక తీర్చుకోవడం కోసం వారు ఎన్ని సరిహద్దులు దాటుతారు? చివరికి తమ అంతర్గత శత్రువులను ఎలా జయిస్తారు? అనే ప్రశ్నల చుట్టూ సినిమా ఆసక్తికరంగా సాగుతుంది.
నటన – దర్శక ప్రతిభ:
మొదటి భాగంలో పాత్రల పరిచయం, వారి ఆశలు, ఆలోచనలు చతుర–వితుర హాస్యంతో కలిసిపోతూ ఆసక్తి రేకెత్తిస్తాయి.
ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత కథ మరింత లోతుగా మారుతుంది. రెండవ భాగంలో జయశంకర్ తన ఏడేళ్ల పరిశోధనను తెరపై ఆవిష్కరించారు.
ప్రతి పాత్రలో వచ్చే మార్పు, ఆత్మజాగృతి చూపించిన తీరు చప్పట్లకు పాత్రం.
సమాజానికి చెప్పాలనుకున్న సందేశం ఎక్కడా బోధాత్మకంగా కాకుండా, హృదయానికి తాకేలా సాగింది.
ప్రీ–క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకు గుండె. ఆ ఎమోషనల్ పీక్స్ ప్రేక్షకుడిలో గూస్ బంప్స్ పుట్టిస్తాయి. చివరికి “మంచి సినిమా చూశాం” అనిపించే తృప్తి కలుగుతుంది.
నటీనటుల ప్రదర్శన:
వినోద్ వర్మ ఈ చిత్రానికి ప్రాణం. ఆయన పాత్రలోని విభిన్న ఛాయలను అద్భుతంగా ఆవిష్కరించారు.
సాయి కుమార్, అనసూయ, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్ — అందరూ తమ పాత్రల్లో బలంగా నిలిచారు.
సాంకేతిక విశ్లేషణ:
అనూప్ రూబెన్స్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలం. సినిమాటోగ్రఫీ విజువల్‌గా అద్భుతం.
పరిమిత బడ్జెట్‌లో చేసిన వీఎఫ్ఎక్స్ పనితనం ప్రశంసనీయం. దర్శకుడి విజన్‌కు నిర్మాతల ధైర్యం బలంగా తోడైంది.
‘అరి’ మానవుడి అంతర్గత యుద్ధాన్ని ప్రతిబింబించే ఆలోచనాత్మక చిత్రం.
అరిషడ్వర్గాల వంటి లోతైన అంశాన్ని జయశంకర్ గుండెలోంచి తెరపైకి తెచ్చారు.
ఇలాంటి విభిన్న, సందేశాత్మక సినిమాలను ప్రేమించే ప్రేక్షకులు తప్పక చూడవలసిన చిత్రం ఇది.
లాస్ట్ పంచ్: వెరైటీ సబ్జెక్ట్ – బలమైన ఎమోషన్ – ఆలోచింపజేసే మెసెజ్.
- రేటింగ్: 3/5
